నేనొక RTC కండక్టర్ ను
నేనొక RTC కండక్టర్ ను
నేను కూడా కొద్దో గొప్పో చదివాను,
కానీ ప్రతి ఉదయం లక్షల మందిని ఉన్నత విద్యకోసం వారి వారి విద్యాలయాలకు, ఉద్యోగాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను,
ప్రతిరోజు వందలమందితో మాట్లాడి ఒక్కొక్కరిది ఒక్కో రకమైన మనస్తత్వం ఉన్నా,అందరిని సమన్వయం చేసుకొని వారి గమ్యస్థానాలకు చేర్చే ఓర్పు నేర్పు నాది... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఒంట్లో సమస్యలు పట్టిపీడిస్తూ సత్తువ లేకుండ చేస్తున్నా, బిచ్చగాడు భుజానికి జోలె వేసుకొని అడుక్కున్నట్లుగా, క్యాష్ బ్యాగ్ వేసుకొని టికెట్ల రూపంలో ఒక్కొక్కరి దగ్గర అడుక్కొని తెచ్చి మొత్తం జమ చేసి ఆ డబ్బులన్నీ సంస్థలో కట్టి ఈరోజుకు దినదిన గండంగా ఇలా డ్యూటీ అయిపోయిందబ్బా... హమ్మయ్యా...అనుకుంటాను ఎందుకంటే.....
నేనొక RTC కండక్టర్ ను
నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగు చేస్తూ, నైట్ అవుట్ నరకంలా.. ఉన్నా...MGBS మూసి కాలువ పక్కన బస్సు ఆపి ఏదో ఒక సీటు పైనే.. పక్క వాల్చి, జాలిలేని దోమలు నన్ను కుట్టి రక్తాన్ని పీలుస్తున్నా, నిద్రమత్తులోనే వాటిని దులుపుకుంటూ నిద్రలేని అహోరాత్రులు వాటితో సహవాసం చేస్తా... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
లోకమంతా దసరా, దీపావళి సంక్రాంతి ఉగాది అంటూ ఆనందంగా జరుపుకుంటుoటే,పండగ పూట ఇంట్లో నాన్న లేడు ఎందుకమ్మా ? 😭😭😭అని అడిగే ఆ పిల్లలకు తెలియదు,మీ నాన్న పండగ పూట డ్యూటీ చేస్తూ టికెట్లు ఇవ్వకుంటే, బస్సులు నడవవని లక్షల కుటుంబాలకు పండగ ఉండదని....ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
ఎండాకాలం వేడి ఎంత ఉన్నా, ఆ రేకు బస్సులో రేకుల గలగల చప్పుడులో నేనొక రేకునై,10,20, రూ"ల టికెట్ కు100,500, నోటు ఇస్తే, ఎన్నో అవాకులు చివాకులు పడుతూ టికెట్ డబ్బులు పోను మిగతా చిల్లర ఇస్తూ, ప్రస్తుత మహాలక్ష్మి పథకంతో రద్దీగా ఉన్న,ఈ జన సందోహం మధ్య చిట్టెలుకలా దూరిపోతూ....ఎండకు ఆ చెమటలతో యూనిఫామ్ ఉప్పూరిపోతున్నా, వాటర్ బాటిల్ లోని నీళ్లు ఉడుకుడుకయినా, రాత్రికనీ తెచ్చుకున్న సద్ది పాచిపోయినా అలాగే కళ్లుమూసుకొని తిని, లేదా ఒక్కొక్కసారి నీళ్లతోనే కడుపు నింపుకొని తదుపరి దాదాపు 50 కుటుంబాలను గమ్యస్థానాలకు చేరుస్తుంటాను.... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
డ్రైవర్ గారికి సహకారంగా బయలుదేరేటప్పుడు, ఆపేటప్పుడు రివర్స్ తీసేటప్పుడు,విజిల్ తో సంకేతాలిస్తూ,హ్యాండ్ క్యాప్డ్, సీనియర్ సిటిజన్స్, లేడీస్ రిజర్వేషన్ సీట్లను వాళ్లకి సరిచేస్తూ...బస్సు ఫెయిల్ అయినప్పుడు ప్రయాణికుల చేత ఎన్నో తిట్లు తింటూ భరిస్తూ ఓర్పుతో నేర్పుతో సమాధానం చెబుతూ వేరే బస్సు ఎక్కించి, బస్సు మళ్ళీ డిపోకు చేరే దాకా బస్సులోనే సహవాసం చేస్తుంటాను.... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
కొందరు మతిభ్రమించిన ప్రయాణికుల నోట అమ్మనా బూతులు పడుతూ, బస్టాండ్లో బస్సు పక్కకు ఆపి అదే బస్సులో డ్రైవర్ తో కలిసి ఇద్దరం తెచ్చుకున్న భోజనాన్ని షేర్ చేసుకుంటూ నోట్లో ముద్ద పెట్టుకొని కూడా...... కిటికీలోంచి ప్రయాణికులు సీట్లు వేసుకుంటూ,అడిగే సమాచారాలకు బదులిస్తుంటాను... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
నైటవుట్ డ్యూటీలో డ్రైవర్ నిర్విరామంగా బస్సు నడుపుతున్నప్పుడు అతడి కళ్ళు నిద్రలోకి జారుకోకుండా అతనికి దగ్గరగా వెళ్లి ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రను మైమరిపిస్తూ ప్రయాణికులే మా దేవుళ్ళు అని సురక్షిత సుఖవంతమైన ప్రయాణాన్ని ఇస్తూ క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ముందుకెళ్తుంటాం ఎంతైనా మేమిద్దరం సంస్థకు రెండు కళ్ళం కదా... ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
బంధుమిత్రుల శుభ కార్యాలకు కానీ చావులకు కానీ ఎన్నింటికో హాజరు అవ్వాల్సిన నేను లీవ్ ఇచ్చే పరిస్థితి లేక, భార్యా పిల్లలను పంపించి నేను గైర్హాజరవుతుంటాను, అటువంటప్పుడు ఆ బంధుమిత్రులు ఎన్నోసార్లు నువ్వు కండక్టర్ వా లేక కలెక్టర్ వా అని మొఖం మీదే అన్నప్పుడు అట్టి వాటిని చిరునవ్వుతో చిదిమేసుకుంటూ ముందుకెళ్తాను..ఎందుకంటే
నేనొక RTC కండక్టర్ ను
కానీ..ఇన్ని చేసిన నాకు
చికిత్స కోసం ADC ని లీవ్ అడగాలంటే భయం,
ఒకటవ తారీకు జీతం ఆలస్యం అయితే,పిల్లల చదువుల కోసం శాలరీ కటింగ్ పెట్టి అప్పు తెచ్చిన బ్యాంకులోన్ నెల నెలా EMI లో,పెనాల్టీ వేస్తారని భయం
తార్నాక హాస్పిటల్ లొ డాక్టర్ ని చూస్తే భయం, హే ఎందుకయ్యా నీకు SICK లీవ్, SICK లేదు ఎం లేదుపో అంటాడేమోనని (అయినా బస్సులో ఎంతటి సడన్ బ్రేక్ వేసినా తొక్కుకొని నిలబడి టికెట్లిచ్చేది నేనే కదా, ఆ నొప్పి నాకు మాత్రమే తెలుసు)
డిపోలొ ఆఫీసర్ ఎదురైతే భయం, EPK ఎందుకు తక్కువైందని అడుగుతారేమొనని, (50 మంది పట్టే బస్సులొ 100,120 మంది ఎక్కి అందులో మెజారిటీ ప్రయాణికులు మహాలక్ష్మి జీరో టికెట్లే ఉంటే...EPK ఎక్కడోస్తుందని చెప్పాలనిపిస్తది కానీ భయం, నోర్ముయ్ అంటారేమోనని)
నేను టికెట్లు ఇచ్చి రైట్ రైట్ చెప్పి,బస్ ముందుకు కదిలించనిదే సంస్థ ముందుకు కదలదు,అది అందరికీ తెలుసు,అయినా నేనంటే అందరికి చిన్న చూపు,
బస్సు నిండా ఉన్న జనంలో ఎవరో ఒకరు టికెట్ తీసుకోకపోయినా, నేను ఇవ్వకపోయినా, తీసుకున్న టికెట్ పోగొట్టుకున్నా, నిద్రలో ఉండి ఒకచోట దిగాల్సిన ప్రయాణికుడు ఇంకొక చోటుకు ప్రయాణం చేసినా, స్టాప్ లేనిచోట స్పీడ్ గా వెళ్తున్న బస్సు ఆపితే.. ఆపలేదని కంప్లైంట్ ఇచ్చినా... ఇలా రకరకాలుగా చెయ్యని నేరాలకు కూడా చార్జి షీట్లు,చార్జి మెమోలు, షోకాస్ నోటీసులు, సస్పెన్షన్ ఆర్డర్స్, రిమూవల్ ఫ్రమ్ దా సర్వీస్, ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడం బ్లాక్ చేయడం అనగా 👇
(కొన్ని నెలలు కొంత జీతం కట్ చేయడం, లేదా నెల నెలా జీతం లో రిటైర్మెంట్ వరకు కొంతమేర కోతలు కోయడం)
దీనిని మా భాషలో కడుపు కొట్టడం అంటాం,
ఈ బాధ ఎలా ఉంటుందంటే 4 దెబ్బలు కొట్టినా తట్టుకునే వాళ్లమేమో కానీ😭 సర్వీస్ మొత్తం ఈ బాధను భరించలేక చాలీచాలని జీతాలతో బయట అప్పులు చేస్తూ, మనసు శరీరం రోజురోజుకు క్షీణించి బిపి, షుగర్,హార్ట్ఎటాక్, వంటి జబ్బులతో రిటైర్మెంట్ కాకముందే చనిపోయే పరిస్థితులు ఈమధ్య చాలానే చూస్తున్నాం
పోవోయ్, రావోయ్, వెళ్లవోయ్, మూసుకొని డ్యూటీ చెయ్యవోయ్ ఇవన్నీ మాకు మామూలు పదాలే, అయినా మనసు చంపుకొని ఓర్చుకొని భరిస్తూ,డ్యూటీ చేస్తున్నా, అందరిలా నాకు ఒక కుటుంబం ఉంది, నా భార్య పిల్లల పోషణార్థం బరువు బాధ్యతలు నావి కనుక భరిస్తాను...ఎందుకంటే...
నేనొక RTC కండక్టర్ ను🙏🙏
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి