🌷 మన దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అయితే, దేశ రక్షణకు సైనికులు వెన్నుముక లాంటివారు. వారి త్యాగం ఎంత వెలకట్టలేనిదో అందరికీ తెలిసిందే. అయితే, మనం ప్రతీ రోజు ఆధారపడే రవాణా రంగం ఉద్యోగులూ అంతే వెలకట్టలేని సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కండక్టర్లు — వీరు మన ప్రయాణంలో తోడుగా నిలిచి, మనల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే కనిపించని యోధులు.
👉 129 డిపోలలో 11,162 బస్సులు ప్రతీ రోజు 39 లక్షల కిలోమీటర్లు పరిగెత్తుతూ 14.75 కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న ఈ మహా సంస్థలో 44,749 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 16,366 మంది మగ మరియూ మహిళా కండక్టర్లు అర్ధరాత్రి , అపరాత్రి , పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా తమ జీవితాన్ని ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం అర్పించారు.
👉 రోజుకు 8 గంటలపాటు కదులుతున్న బస్సులో నిలబడి, వందలాది ప్రయాణికులను కలుస్తూ, ప్రతీ ఒక్కరికి చిరునవ్వుతో టికెట్ ఇచ్చి, మార్గదర్శకుడు గా , ఆర్థిక లావాదేవీలు సజావుగా నిర్వహించడం చిన్న విషయం కాదు. అనేక రూట్లలో సరైన రక్షణ , మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా లేని ప్రాంతాల్లో విధులు నిర్వహించే "మహిళా కండక్టర్లు " సేవలు ఇంకా వెలకట్టలేనివి.
🚍 ఒక జిల్లా సర్వీసు బస్సు కండక్టరు రోజుకి సగటున 250 మందిని, నెలకు 6 వేల మందిని, సంవత్సరానికి 72 వేల మందిని, 25 ఏళ్ల కనీస సేవలో 18 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాడు.
🚍 ఒక సిటీ బస్సు కండక్టరు రోజుకి 500 మందిని, నెలకు 12 వేల మందిని, సంవత్సరానికి 1 లక్షా 44 వేల మందిని, 25 ఏళ్లలో 36 లక్షల మందిని ప్రజల గమ్యానికి చేరుస్తాడు.
అంటే, ఒక్క కండక్టరు జీవితంలో కలిసిన మనుషుల సంఖ్య, ఈ భూమిపై మరే ఇతర ఉద్యోగి కలిసే అవకాశం లేనంత విస్తారమైనది. ఇది వారి సేవల మహోన్నతతకు నిదర్శనం.
అయితే, ఇంతటి గొప్ప సేవ చేసినప్పటికీ కండక్టర్లకు సమాజంలో గౌరవం తగినంతగా రావడం లేదు. పదవీ విరమణ చేసినప్పుడు కొన్నిసార్లు ఆదర్శ ఉద్యోగులు అని చెప్పి చిన్న సమావేశాలు , లేదా లయన్స్ క్లబ్ వంటి సంస్థల చిరు సత్కారం తప్ప , ప్రభుత్వం గాని, ప్రజలు గాని వారిని గుర్తించడం లేదనే విషయం మనసును కలచివేస్తోంది. మరింత దురదృష్టకరం ఏమిటంటే, కొత్త నియామకాలు లేకపోవడం వల్ల 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా డబుల్ డ్యూటీలు చేసి, బలహీనమైన శరీరంతోనూ నిలబడి పని చేయవలసి వస్తోంది.
🙏 ఇంత కష్టం చేసి, లక్షలాది మందిని సురక్షితంగా చేర్చే ఈ దేవుళ్ళువంటి కండక్టర్లకు గౌరవం ఇవ్వకపోతే అది మన సమాజం మీద మచ్చ లాంటిది.
అందుకే —
➡️ డ్రైవర్స్ డే మాదిరిగానే, “కండక్టర్స్ డే” ని ప్రభుత్వం ప్రకటించాలి.
➡️ ఆ రోజు కేవలం కండక్టర్లనే కాదు, వారి జీవిత భాగస్వాములను కూడా ఘనంగా సత్కరించాలి.
➡️ ప్రజలు, ప్రభుత్వం కలిసి ఒక స్వరంతో “ధన్యవాదాలు కండక్టరుగారూ ” అని చెప్పే రోజు ఉండాలి. కండక్టర్లు కేవలం టికెట్ ఇచ్చే ఉద్యోగులు కాదు. వారు ప్రతీ ప్రయాణికుడి సురక్షిత గమ్యానికి కాపలాదారులు, వందలాది ముఖాల్లో చిరునవ్వులు రప్పించే మానవతావాదులు.
🌺 కాబట్టి మనమందరం కలసి “కండక్టర్ల గౌరవ దినోత్సవం” కోసం పిలుపునివ్వాలి . అది మన కృతజ్ఞత మాత్రమే కాదు, వారి త్యాగానికి ఇచ్చే న్యాయం కూడా. 🌺
🚌 ప్రతిపాదన : భారతదేశంలో ప్రజా రవాణా లక్షలాది మందిని కలుపుతూ జీవనాడిగా నిలుస్తోంది. ఈ వ్యవస్థను సాఫీగా నడిపే శ్రామికులలో, బస్సు కండక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. భారతదేశం లో బెస్ట్ సంస్థ తరపున శ్రీ ఫకీర్ మహమ్మద్ బాబా గారు 15 జూలై 1926 న ఆఫ్ఘన్ చర్చ్ నుండి క్రాఫోర్డ్ మార్కెట్ వరకూ బొంబాయి లో మొదటి బస్సు కండక్టరు గా విధులు నిర్వహించారు. ఇప్పటి వరకు బస్సు కండక్టర్లు సేవలకు గుర్తింపుగా ఎటువంటి ప్రత్యేక దినోత్సవం జరపడం లేదు.
కేంద్ర ప్రభుత్వ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం గుర్తింపు పొందిన 56 ప్రభుత్వ రవాణా సంస్థలలో సుమారు 4 లక్షల మంది బస్సు కండక్టర్లు ఉన్నారు. వీరి సేవలను గుర్తించి , స్మరించుకోనుటకు ,
గౌరవ సూచకంగా మొదటి బస్సు కండక్టరు గా విధులు నిర్వహించిన " 15 జూలై " ను ప్రతి సంవత్సరం " బస్సు కండక్టరు అభినందన దినోత్సవం " గా అధికారకంగా , "కండక్టర్స్ డే " గా జరపాలని ప్రతిపాదిస్తున్నాను.
👉 తద్వారా వీరి సేవలకు గౌరవం లభిస్తుంది. ప్రజా రవాణా సిబ్బందికి గౌరవం పెరుగుతుందిని భావిస్తున్నాను. భవిష్యత్ తరాలకు ప్రేరణ గా కూడా ఉంటుంది. ఈ దిశగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో గల అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్ర మరియు రాష్ట్ర రవాణా శాఖల వద్ద తగు ప్రతిపాదనలు చేసి , అధికారంకగా " కండక్టర్స్ డే " అమలు చేయమనవి.
Written By
వెంకట సూర్య వేణుగోపాల్ నాగుమళ్ళ
విశ్రాంత ఆర్ టి సి డిపో మేనేజరు,
విజయనగరం.
మొబైల్ 7013552888.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి